Showing posts with label attack. Show all posts
Showing posts with label attack. Show all posts

2.16.2025

Eight symptoms that appear before a heart attack:Prevention-of-diseases

గుండె పోటు వచ్చే ముందు కనిపించే ఎనిమిది లక్షణాలు



ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు.

సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఓ అంశం ఒకటి ఉంది. అదే గుండెపోటు. ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండె పోటు బారిన పడుతున్నారు.

గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ప్రాణాంతకం కావచ్చు. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరానికి నష్టం వాటిల్లినప్పుడు ఇది సంభవిస్తుంది. గుండెపోటు యొక్క కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొన్నింటిని గుర్తించకపోవచ్చు. గుండెపోటు సంకేతాలు లేదా లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో సకాలంలో చికిత్స అందించవచ్చు. గుండెపోటు ఎనిమిది ప్రధాన లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం

​గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మెడ, ఎడమ దవడ, భుజం, వీపు లేదా చేతులకు వ్యాపిస్తుంది. అయితే, ఛాతీ నొప్పి కొన్నిసార్లు గ్యాస్ వల్ల కూడా రావచ్చు.

శ్వాస ఆడకపోవడం

​ఛాతీ నొప్పితో లేదా ఛాతీ నొప్పి లేకపోయినా శ్వాస ఆడకపోవడం గుండెపోటుకు కీలకమైన సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా పనిచేయలేనప్పుడు, ఊపిరితిత్తులు సరైన మొత్తంలో ఆక్సిజన్‌ను అందుకోలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

చెమటలు పడటం

అకస్మాత్తుగా చలితో చెమటలు పట్టడం గుండెపోటుకు మరొక హెచ్చరిక లక్షణం. ఈ చెమట సాధారణంగా ఒత్తిడి లేదా వేడి వల్ల కలగదు. కానీ శరీరం లోపల జరుగుతున్న కొంత అవాంతరానికి సంకేతం కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా మీకు చెమటలు పడుతుంటే, దానిని లైట్ తీసుకోవద్దు.

తలతిరగడం లేదా మూర్ఛపోవడం

గుండెపోటు సమయంలో, గుండె పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా తగినంత రక్తం మెదడుకు చేరదు. దీంతో రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలతిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు.

వికారం లేదా వాంతులు

కొంతమందికి గుండెపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణం తరచుగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండానే వికారం లేదా వాంతులు అనిపిస్తే, దానిని తీవ్రంగా పరిగణించండి. అంతేకాకుండా చాలా మందికి గుండెపోటుకు ముందు అజీర్ణం లేదా ఛాతీలో మంటగా అనిపించవచ్చు.

అలసట

ఎటువంటి కష్టం, పని చేయకపోయినా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ఈ అలసట సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. రోజు రోజుకి అలసట క్రమంగా పెరుగుతుంది. ఈ లక్షణం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

చేయి, మెడ లేదా దవడలో నొప్పి

గుండెపోటు సమయంలో, నొప్పి ఛాతీ నుంచి ప్రారంభమై చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఎడమ చేతిలో ఎక్కువగా ఉంటుంది. కానీ కుడి చేతిలో కూడా సంభవించవచ్చు. ఈ ప్రాంతాల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే, అది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు.

క్రమరహిత హృదయ స్పందన

హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. దీనిని తరచుగా "దడ" అని పిలుస్తారు. దీనిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణం తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.