అయితే వేగంగా గుండె కొట్టుకోవడంతో ఆ సమయంలో మొదటిసారి ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవారు తమకు ఏదో జరిగిపోతుందనే ఆందోళనకు గురవుతుంటారు. గుండెపోటుకు దారితీస్తుందేమోనని భయపడుతుంటారు. కానీ భయం అవసరం లేదు! ఎందుకంటే గుండె దడ అనేది సర్వసాధారణంగా తలెత్తే సమస్యేనని, గుండె పోటు లక్షణాకుల, దీనికి సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
నీటిశాతం తగ్గితే..
సాధారణంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు, కెఫిన్ వంటివి అధికంగా తీసుకున్నప్పుడు గుండె దడకు దారితీస్తుందనే విషయం తెలిసిందే. ఇలాంటి అలవాట్లు, జీవన శైలి మార్పులు మాత్రమే కాదు, బాడీలో నీటిశాతం తగ్గినా గుండె దడ మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి కొద్దిసేపు వచ్చిపోయే గుండె దడ ఇక్కడ ప్రమాదకరం కాదు. కానీ.. శరీరంలో నీటిశాతం తగ్గడమనేది కొనసాగితేనే డేంజర్ అంటున్నారు నిపుణులు. ఇది గుండె రక్తనాళాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్‌కు దారితీసి ప్రాణాంతకం కావచ్చు. అందుకే బాడీలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి.
రక్త ప్రవాహానికి ఆటంకం:
అసలు గుండె దడకు, నీటిశాతం తగ్గడానికి మధ్య సంబంధం ఏమిటనే అనుమానం రావచ్చు. కానీ శరీరంలో ద్రవాల మోతాదుని బట్టి కూడా ఆరోగ్యం ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నీటిశాతం తగ్గితే రక్త ప్రవాహ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుందని, బ్లడ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనివల్ల గుండె కండరాల వ్యాకోచ, సంకోచాలకు తగిన సపోర్ట్ (పీడనం) లభించదన్నమాట. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. రక్తాన్ని పంప్ చేయడానికి, శరీర భాగాలకు సప్లయ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అందుకే గుండె దడ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే వ్యాయామాలు చేసినా, ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగినా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఈ సందర్భంలో శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నట్లయితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత మరింత దెబ్బతింటుంది. ఇది గుండె, రక్తనాళాలపై ఒత్తిడికి కారణం అవుతుంది.
ఎలా గుర్తించాలి:
గుండె దడ ఎందుకు వస్తుందనేది తెలుసుకోవడం ఈజీనే కానీ.. ఎలా గుర్తించాలన్నదే అంత సులభం కాదంటున్నారు నిపుణులు. అయితే నీటిశాతం తగ్గడంవల్ల తలెత్తే గుండె దడను మాత్రం కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చునట. ఏంటంటే.. యూరిన్ గాఢమైన రంగులో రావడం, మలబద్ధకం, తక్కువసార్లు మూత్ర విసర్జన, తలనొప్పితో పాటు గొంతు, నోరు ఎండిపోవడం, కండరాలు పట్టేడయం, ఛాతీలో బిగుతుగా అనిపించడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో నీటిశాతం తగ్గి ఉండవచ్చు. క్రమంగా ఈ పరిస్థితి కూడా గుండె దడకు దారితీస్తుంది. నీటిశాతం కవర్ కాకుంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తి ప్రాణాంతకం కావచ్చు. అందుకే సరిపడా నీరు తాగుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయట ఎండలో తిరిగేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలతో గుండె దడమొదలైతే.. నీటిశాతం పడిపోతుంది. కాబట్టి అప్పుడు ఓఆర్ఎస్ పొడిని నీటిలో కలిపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె దడ అధికమై ఎంతకీ తగ్గని పరిస్థితి కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మాకు ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.