లవంగ లతలు తయారుచేయు విధానం:
కావలసినవి: మైదాపిండి-1/2 కేజీ, నెయ్యి-1/4 కేజీ, పంచదార-1/4 కేజీ., బియ్యంపిండి-1 కప్పు, పేరిన నెయ్యి-1/2 కప్పు, పాలు-1 కప్పు.
తయారుచేయు విధానం:
1. చక్కగా జల్లించుకొన్న మైదాపిండిలో కాచినపాలు పోసి కలపాలి. తరువాత నీళ్ళుపోసి కలుపుతూ, పూరీల ముద్దవలే చేసుకోవాలి. ఈ పూరీల ముద్ద రెండు గంటలు నానబెట్టాలి.
2. పంచదార పొడికొట్టి వుంచుకోవాలి.
3. బియ్యం పిండి, పేరిన నెయ్యి ముద్దగా కలుపుకోవాలి.
4. మైదా ముద్దను పీటమీద వేసి బాగా మర్దన చేయాలి. ఇది పెద్ద పెద్ద వుండలుగా చేసుకొని చపాతీలవలె వత్తుకోవాలి.
5. చపాతీ పైన నెయ్యి, బియ్యం పిండి ముద్ద 3 స్పూనులు వేసి పలుచగా పూయాలి.
6. తరువాత చపాతీని చాపవలె చుట్టుకు రావాలి. దీనిని అరంగుళం ముక్కలుగా కోయాలి.
7. ఒక్కొక్క ముక్క మరల పూరీ సైజులో వత్తాలి.
8. ఇలా అన్నీ చేసి, మూకుడులో నెయ్యి కాగిన తరువాత వేయించుకోవాలి.
9. పంచదార పొడుం రెండువైపులా రెండు స్పూనులు చల్లి వుంచాలి.
10. ఇవి డబ్బాలలో నిల్వ చేసికొంటే 10 రోజుల వరకూ వుంటాయి.