సీతా భోగ్ తయారుచేయు విధానం:
కావలసినవి: పాలకోవా-1 కప్పు, గోధుమపిండి-1 కప్పు, నెయ్యి-1/2 కప్పు, పంచదార-1 /2 కప్పు, చారపప్పు-15 గ్రా., ఏలకులు-10, సీమబాదం పప్పులు-10, పచ్చకర్పూరం-తగినంత, కుంకుమపువ్వు- తగినంత.
తయారుచేయు విధానం:
1. పాలకోవాను ముందుగా తయారు చేసుకోవాలి.
2. పంచదారలో కాసిన్ని నీళ్లు పోసి, లేతపాకం రానిచ్చి దింపాలి.
3. సీమబాదం పప్పులు, నీళ్ళలో నానబెట్టి, తొక్కలు వొలిచి నిలువుగా చీల్చుకోవాలి. చారపప్పుని నేతిలో వేయించి తీసి ఉంచాలి. ఏలకులు పొడుం చేసుకోవాలి.
4. గోధుమపిండి తెల్లగా ఉండేది తీసుకోవాలి. ఈ పిండిలో 1 గరిట నెయ్యి కాగబెట్టి, పోసి కలపాలి. ఈ పిండిలో పాలకోవా వేసి, కలిపి నీళ్ళు చల్లుతూ, పూరీ పిండివలే కలపాలి. కొద్దిగా నీళ్ళు తడిచేసుకొంటూ పలుచగా చేయాలి. అరగంట సేపు మర్దన చెయ్యాలి.
5. మూకుడులో నెయ్యివేసి, పోయ్యిమీద ఉంచి, సన్నని రంధ్రముల చట్రం తీసుకొని పిండిపోసి చేతితో రుద్దితే,
సన్నగా బియ్యం గింజలవలే పడతాయి.
6. అవి వెంటనే తీసి పాకంలో వెయ్యాలి. అలా బూందీ అంతా పాకంలో వేసి, పాకం పొయ్యిమీద పెట్టి, రెండు పొంగులు రానివ్వాలి.
7. ఇందులో చారపప్పు, సీమబాదం పప్పు, ఏలకులపొడి వేసి కలిపి దింపాలి.
8. చల్లారిన తరువాత కుంకుమ పువ్వు, సీమబాదాంపప్పు వేసి, పెద్ద నిమ్మకాయ ఉండలంత చేసుకోవాలి.