కరివేపాకు.. ప్రతి వంట్లో ఉండాల్సిందే. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని కరివేపాకుల్ని నమిలితే జీర్ణక్రియ మెరగవుతుంది.
జీవక్రియ వేగవంతం అవుతుంది. కాలేయం క్లీన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక, కరివేపాకు మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు. కరివేపాకు మొక్క సరిగ్గా పెరగకపోతే కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి.
శీతాకాలంలోని వాతావరణం మొక్కలకు సవాల్‌తో కూడుకుంది. అందుకే మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెరిగిన చలి, తక్కువ సూర్యకాంతి, తేమ లేకపోవడం వల్ల మొక్కలు త్వరగా వాడిపోతాయి. మొక్కల ఆకులు రంగు మారిపోవడం, ఎండిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక, కరివేపాకు మొక్క కూడా చలికాలంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ప్రతి ఇంట్లో దాదాపు ఉండే మొక్క ఏదైనా ఉందంటే అది కరివేపాకే.
మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో కరివేపాకు మొక్క పసుపు రంగులోకి మారుతుంది. ఆకులు రాలిపోవడం లేదా అస్సలు పెరగకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మీ పెరట్లో లేదా ఇంట్లోని మొక్క కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంటే.. కొన్ని చిట్కాలు బాగా పనికొస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తగినంత సూర్యకాంతి ముఖ్యం
శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల కరివేపాకు మొక్క ఎక్కువగా ప్రభావితమవుతుంది. మొక్క నిరంతరం నీడలో ఉంటే, దాని ఆకులు బలహీనంగా, పసుపు రంగులోకి మారి, రాలిపోవడం ప్రారంభిస్తాయి. మొక్కను కనీసం 5-6 గంటల సూర్యరశ్మి లభించే ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి.
మీ ఇంటి బాల్కనీకి తక్కువ సూర్య రశ్మి లభిస్తే అలర్ట్ అవ్వండి. మొక్కను ప్రతిరోజూ కొన్ని నిమిషాలు టెర్రస్ లేదా తగినంత సూర్యరశ్మి ఉన్న మరొక ప్రదేశానికి మార్చండి. సూర్యరశ్మి లభించిన తర్వాత, మొక్కలో కొత్త ఎనర్జీ వస్తుంది.
నీరు విషయంలో జాగ్రత్త
శీతాకాలంలో నీరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో మొక్కలకు తక్కువ నీరు అవసరం. ఎందుకంటే నేల తేమగా ఉంటుంది. అందుకే మొక్క నేల నెమ్మదిగా ఎండిపోతుంది. దీని వల్ల ఎక్కువగా నీరు పెట్టడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోతాయి.
అందుకే నీరు పెట్టేటప్పుడు మట్టిని తనిఖీ చేయండి. నేల పొడిగా ఉంటేనే నీరు పెట్టండి. అధికంగా నీరు పెట్టడం వల్ల మొక్క బలహీనపడి కుంగిపోతుంది. అందుకే అవసరమైన సమయాల్లో తక్కువ మోతాదులో నీరు అందించండి.
సరైన నేల మిశ్రమం చాలా ముఖ్యం
కరివేపాకు మొక్క పోషకాలు ఎక్కువగా ఉన్న నేలలో బాగా పెరుగుతాయి. అందుకే మట్టిని ఎండిన ఆవు పేడతో కలపండి. కావాలంటే వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేయండి. దీంతో, నేలకు తగిన పోషకాలు లభిస్తాయి. ఇది కరివేపాకు మొక్కకు తగినంత పోషణ అందుతుంది. ఇలా చేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది.
ఎరువులు ముఖ్యం
కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఐరన్ అవసరం కావచ్చు. దీనిని సేంద్రియ ఎరువులు అందించగలవు. రసాయన ఎరువులు మొక్కను దెబ్బతీయవచ్చు. అందుకే ఇంట్లోనే సహజమైన, సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని తేలికగా రుబ్బి నీటిలో నానబెట్టండి. నీటిని వడకట్టి, బియ్యాన్ని ఒక కంటైనర్‌లో నిల్వ చేసి, మీ కరివేపాకు మొక్కలకు జోడించండి.
పులియబెట్టిన మజ్జిగను కూడా కరివేపాకు మొక్కకు పోయవచ్చు. వేప ఆకుల్నిఎండబెట్టడం ద్వారా కరివేపాకు మొక్కకు సహజ ఎరువు అందించవచ్చు. ఇందుకోసం ఆకుల్ని పూర్తిగా ఆరబెట్టి పొడిని సిద్ధం చేయండి. ఈ పొడిని మట్టిలో తవ్వి కలపండి. ఇవి మొక్కకు తగిన పోషకాలు అందించి.. ఏపుగా, గుబురుగా పెరిగేలా చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరివేపాకు మొక్క చిన్న చిన్న తెల్ల పువ్వుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పువ్వులు మొక్క పెరుగుదలను అడ్డుకుంటాయి. మొక్క వాడిపోతుంటే.. ఈ పువ్వుల్ని కత్తిరిచడం చాలా ముఖ్యం.
కరివేపాకు మొక్క చాలా పొడవుగా పెరుగుతుంటే, ముందుగా కాండం మధ్యలో కత్తిరించండి. దీనివల్ల కాండం రెండుగా విడిపోతుంది. అక్కడ నుంచి కొత్త ఆకులు మొలకెత్తుతాయి. అలాగే, మూడు కొమ్మలు పెరిగే కాండం కత్తిరించండి. ఇది కరివేపాకు మరిన్ని కొమ్మలు మొలకెత్తడానికి ప్రోత్సహిస్తుంది.
గమనిక:-
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. వీటిని పాటించేముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం శ్రేయస్కరం. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.