ప్రస్తుత రోజుల్లో ఫిట్‌నెస్ పేరుతో సోషల్ మీడియాలో అనేక రకాల డైట్ ట్రెండ్‌లు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ''లిక్విడ్ డైట్". ఇటీవల తమిళనాడులోని కన్యాకుమారిలో 17 ఏళ్ల యువకుడు ఈ డైట్‌ను పాలో అయి మరణించాడు.
వైద్య సలహా లేకుండా ట్రెండింగ్ డైట్‌ను అనుసరించడం ఎంత ప్రమాదకరమూ అనేదానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. లిక్విడ్ డైట్ యొక్క ఉద్దేశ్యం జ్యూస్‌లు, స్మూతీలు, సూప్‌లు, షేక్‌లు లేదా మెడికల్ సప్లిమెంట్‌లు వంటివి మాత్రమే తీసుకోవడం. సాధారణంగా ఈ డైట్‌ను శస్త్రచికిత్సకు ముందు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులలో వైద్యుడి పర్యవేక్షణలో ఫాలో అవుతారు. కానీ సోషల్ మీడియాలో ఇది బరువు తగ్గడానికి బెస్ట్ పద్ధతిగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది దీనిని ఫాలో అవుతున్నారు.
లిక్విడ్ డైట్ ఎలా హాని చేస్తుంది..?
ఈ రకమైన డైట్ అందరు పాటించడానికి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా డైట్ తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. ముందుగా ఎవరికి వారు తమ శరీరం గురించి తెలుసుకోవాలి. శరీరానికి ఏది మంచిదో డాక్టర్ ద్వారా తెలుసుకుని దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని చెబుతున్నారు. లిక్విడ్ డైట్‌లో తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉండవని డాక్టర్లు అంటున్నారు. దీని కారణంగా శరీరానికి పూర్తి పోషకాహారం లభించదు. ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది.
ఈ ఆరోగ్య సమస్యల వచ్చే ఛాన్స్..
లిక్విడ్ డైట్ రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు లభించనప్పుడు, రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత అవసరం. ద్రవ ఆహారం ఈ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు, నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఈ సమస్యలు కూడా సంభవించవచ్చు
రక్తపోటు
ఎక్కువ కాలం ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ప్రమాదకరమైన స్థాయికి పడిపోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారవచ్చు.
హార్మోన్ల అసమతుల్యత
యువతలో ఈ ఆహారం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది శారీరక అభివృద్ధిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
జీర్ణవ్యవస్థపై ప్రభావం
ఘన ఆహారం నుండి లభించే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని లోపం మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది.
మానసిక అలసట – చిరాకు
శరీరంలో గ్లూకోజ్, పోషకాహారం లేకపోవడం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి మార్పులు, చిరాకుకు దారితీస్తుంది.
కాబ్ట వైద్యుడి సలహా మేరకు మాత్రమే లిక్విడ్ డైట్ ఫాలో అవ్వాలి. సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత అలాంటి ఆహారం తీసుకుంటారు. కడుపుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడు ఈ ఆహారం తీసుకోవాలని సూచిస్తారు.